Ration Rice Scam : బ్రాండెడ్ బియ్యం ముసుగులో రేషన్ దందా.. హైదరాబాద్‌లో భారీ స్కామ్

Pds Rice

Pds Rice

మార్కెట్లో ప్రస్తుతం కిలో బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. సామాన్యుడు రోజువారీగా కొనుగోలు చేసే సోనా మసూరి, హెచ్‌ఎంటీ పేర్లతో విక్రయిస్తున్న నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. అయితే, అధిక ధర చెల్లించి ప్రజలు ఇళ్లకు తెచ్చుకుంటున్న ఈ బియ్యం నిజంగానే ఒరిజినల్ సోనా మసూరి లేక హెచ్‌ఎంటీ రకాలేనా అంటే కాదనే సంచలన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. నిరుపేదల కోసం ప్రభుత్వం అందించే పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని రీసైకిల్ చేసి, అత్యాధునిక యంత్రాలతో తీవ్రంగా పాలిష్ పట్టి, కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ల పేర్లతో నకిలీ ప్యాకింగ్‌లు వేసి బహిరంగ మార్కెట్లో అత్యంత దర్జాగా విక్రయిస్తున్న భారీ మాఫియా గుట్టును పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు.

నగరవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు.. కర్మాన్‌ఘాట్‌లో ఆపరేషన్

హైదరాబాద్ నగరంలో నకిలీ బ్రాండ్లతో రేషన్ బియ్యం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ముఖ్యంగా కర్మాన్‌ఘాట్ పరిధిలోని రైస్ డిపోలు, దుకాణాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రేషన్ బియ్యాన్ని మిల్లర్ల సహకారంతో రీసైకిల్ చేసి, పాలిష్ ద్వారా సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తున్న బాగోతాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు దుకాణాల నుంచి బియ్యం శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు తరలించారు. కాగా, అధికారుల తనిఖీలతో తీవ్ర భయాందోళనకు గురైన కొందరు వ్యాపారులు షాపుల షట్టర్లు దించేసి అక్కడికక్కడే పరారయ్యారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదు: సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, రీసైకిల్ చేసి రీ-బ్రాండింగ్ పేరిట విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ హెచ్చరించారు. నగరంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై ఆయన స్పందిస్తూ.. రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తూ మార్కెట్లో అమ్ముతున్న మిల్లర్లు, వ్యాపారుల సమగ్ర చిట్టా తమ వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించేందుకు కొందరు మాఫియాగా ఏర్పడి కుట్రలు పన్నుతున్నారని, వారిని ఇప్పటికే గుర్తించామని స్పష్టం చేశారు. మార్కెట్లో బియ్యం ధరల స్థిరీకరణకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని, అక్రమార్కులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.