మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ సిటీ పోలీస్ అమ్ములపొదిలోకి అత్యాధునిక ఈవీ స్మార్ట్ వాహనాలు చేరాయి. నగరంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సేవలందిస్తున్న ‘స్పందన’ విభాగానికి 7, లా అండ్ ఆర్డర్ పెట్రోలింగ్ విధులకు 8 చొప్పున మొత్తం 15 ‘టాటా పంచ్ ఈవీ స్మార్ట్+’ కార్లను కేటాయించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్ జెండా ఊపి ఈ ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) వీటిని సమకూర్చింది.
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్లలోని పెట్రోల్ కార్లు, బ్లూకోల్ట్స్ వాహనాలు సాధారణంగా నిత్య శాంతిభద్రతల పరిరక్షణ, పిటిషన్ల విచారణలతో తీరిక లేకుండా ఉంటాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతోనే ‘స్పందన’ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు సరికొత్త ఈవీ వాహనాలు సమకూరడంతో స్పందన బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని, ‘డయల్ 112’ కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేసుకుంటూ పిలుపు వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయని వివరించారు. ఈ వాహనాలను సమకూర్చిన హెచ్సీఎస్సీ ప్రతినిధులకు, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ భరోసా అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ‘స్పందన’కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే మహిళా పోలీస్ డ్రైవర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని, పాతబస్తీతో పాటు నగరంలోని ఇరుకైన గల్లీల్లో సైతం వేగంగా దూసుకెళ్లేందుకు వీలుగా ఈ కాంపాక్ట్ ఈవీ కార్లను ఎంపిక చేసినట్లు చెప్పారు.
ఒక్కసారి ఛార్జింగ్‌తో 468 కిలోమీటర్లు
40 కిలోవాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన ఈ సరికొత్త ఈవీ కార్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. ప్రస్తుతం నగరంలోని 7 లా అండ్ ఆర్డర్ జోన్లలో 14 స్పందన బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ప్రతి వాహనంలో ఒక మహిళా డ్రైవర్‌తో పాటు ఒక సివిల్ ఉమెన్ కానిస్టేబుల్, ఒక ఏఆర్ ఉమెన్ కానిస్టేబుల్ ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 వరకు షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారు. మహిళా అధికారులే నేరుగా సంఘటనా స్థలానికి చేరుతుండటంతో బాధితులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకోగలుగుతున్నారు.
185 రోజుల్లో 8,903 ఫిర్యాదుల పరిష్కారం
గత 185 రోజుల్లో స్పందన విభాగానికి వచ్చిన 8,903 ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించారు. ఇందులో 1,900 సమస్యలను నిరంతర కౌన్సిలింగ్ ద్వారా, 1,164 వివాదాలను పరస్పర రాజీతో సామరస్యంగా పరిష్కరించి పలు కుటుంబాలను నిలబెట్టారు. తీవ్రమైన సమస్యలపై 2,504 కేసులను స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా, 61 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. గృహహింస, ఆత్మహత్యాయత్నాల వంటి సున్నితమైన ఘటనల్లో పలువురిని రక్షించి ‘సఖి’ కేంద్రాలకు, షెల్టర్ హోమ్‌లకు తరలించడంతో పాటు తప్పిపోయిన నలుగురు చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీలు ఎం. శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు ఆర్. వెంకటేశ్వర్లు, రాహుల్ హెగ్డే, జె. రాఘవేంద్ర రెడ్డి, ఎ. రమణారెడ్డి, డాక్టర్ పి. లావణ్య, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, దాతలు పాల్గొన్నారు.

