Hyderabad NIFT Director Orders Security To Attack Dogs: మాధాపూర్ నిఫ్ట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ మూగజీవులపై క్రూరత్వం ప్రదర్శించాడు. తన సెక్యూరిటీ సిబ్బంది చేత కుక్కల్ని దారుణంగా హింసించాడు. డైరెక్టర్ ఆదేశాల మేరకు సెక్యూరిటీ దాడి చేయగా.. కుక్క పిల్లల కాళ్లు విరిగాయి. మరో కుక్కకు వెన్నుముక విరిగింది. క్యాంపస్ నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు నిఫ్ట్ డైరెక్టర్ ఈ అరాచకానికి పాల్పడ్డాడు. కుక్కలతో అనుబంధం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! ఒక్కసారి ప్రేమగా దగ్గర తీసుకుంటే, అవి అంతకుమించి ప్రేమను ఇస్తాయి. అలాంటి అనుబంధమే నిష్ట్ విద్యార్థులు, కుక్కల మధ్య ఏర్పడింది. కానీ.. డైరెక్టర్ విజయ్ మాత్రం వాటిపై కర్కశత్వం చూపాడు.
మూడు నెలల క్రితమే కుక్కల్ని హింసించొద్దని క్యాంపస్ డైరెక్టర్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అంతేకాదు.. స్ట్రీట్ డాగ్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు వాక్సినేషన్ కూడా చేశారు. అయినా సరే.. డైరెక్టర్ విజయ్ ఆ సూచనల్ని బేఖాతరు చేస్తూ మూగజీవుల్ని హింసించాడు. దీంతో.. అతనిపై చర్యలు తీసుకోవాలని ‘ఆప్ ఫర్ యానిమల్స్’ సభ్యులు కోరుతున్నారు. ట్విట్టర్‌లో అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కు జంతు ప్రేమికులు ఆ డైరెక్టర్‌పై ఫిర్యాదు చేస్తున్నారు. కాగా.. గతంలో నర్సాపూర్ కమిషనర్ కుక్కలను చంపినందుకు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆయన్ను వెంటనే సస్పెండ్ చేశారు.