Site icon NTV Telugu

HYDRA : హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణల తొలగింపు.. వరదల నివారణకు హైడ్రా చర్యలు

Hydra

Hydra

HYDRA : హైదరాబాద్‌లో వర్షాకాలంలో వరదలు ముంచెత్తకుండా నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్ పరిసరాల్లో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఆపరేషన్‌లో హైడ్రా అధికారులు తొలుత బుల్కాపూర్ నాలా, ఐడీఎల్ నాలాల ఆక్రమణలను తొలగించే పనులను చేపట్టారు.

బుల్కాపూర్ చెరువు నుంచి ప్రారంభమై, హైటెక్ సిటీ ప్రాంతాల గుండా హుస్సేన్ సాగర్‌లో కలిసే ఈ నాలా, గత కొన్నేళ్లుగా అనేక చోట్ల ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా తుమ్మలబస్తీ.. ఆనందనగర్ మధ్య నాలా వెడల్పు 8 మీటర్లుండాల్సిన చోట 5 మీటర్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో వర్షాకాలంలో వరదనీరు కాలనీల్లోకి చేరుతున్నట్టు స్థానికులు ఫిర్యాదు చేశారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో అధికారులు పర్యటన నిర్వహించి, శ్రీధర్ ఫంక్షన్ హాల్ నిర్మించిన ఆక్రమణను తొలగించారు. కొన్ని చోట్ల నివాసితులు స్వయంగా నిర్మాణాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారికి కొంత గడువు ఇచ్చారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద నాలా ముఖద్వారాన్ని మూసివేసిన ధర్మాకోల్ వ్యర్థాలను కూడా హైడ్రా తొలగించింది.

కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు నుంచి ప్రారంభమైన నాలా కొన్ని ప్రాంతాల్లో 7 మీటర్ల వెడల్పు ఉండాల్సిన చోట కేవలం 2 మీటర్లకే పరిమితమైంది. హబీబ్‌నగర్, శ్రీహరినగర్, శివశక్తి నగర్ వంటి ప్రాంతాల్లో వరదనీరు తరచుగా చేరుతున్నది. ఈ కారణంగా ఎన్‌ఆర్సీ, ఎన్‌కేఎన్‌ఆర్ ఫంక్షన్ హాళ్ల యజమానులు ఆక్రమణలకు పాల్పడినట్టు గుర్తించి, హైడ్రా అధికారులు వాటిని దాదాపు 70 మీటర్ల మేర తొలగించారు.

Bajaj Pulsar N160: కుర్రాళ్ల డ్రీమ్ బైక్ పల్సర్ N160 కొత్త వేరియంట్ రిలీజ్.. బడ్జెట్ ధరలోనే క్రేజీ ఫీచర్స్

ఈ నాలా మూసాపేట మెట్రో స్టేషన్ దాటి కూకట్‌పల్లి నాలాలో కలుస్తుంది. మార్గమధ్యంలో వివిధ ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణల తొలగింపు పనులు హైడ్రా చేపట్టింది. శివశక్తి నగర్ వద్ద నాలా కేవలం మీటరు-న్నరకు తగ్గిపోయిన నేపథ్యంలో అక్కడి నిర్మాణాలను కూడా తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు.

వర్షాకాలంలో నగరంలోని పలు ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వాటిని నివారించేందుకు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా సత్వర చర్యలు చేపట్టింది. ఆక్రమణల తొలగింపు ద్వారా వరద నీరు సాఫీగా వెళ్లేలా మార్గాలను క్లియర్ చేయడం ప్రారంభించడంతో నగర ప్రజల్లో స్వల్ప స్థాయిలో నమ్మకం ఏర్పడుతోంది.

నాలాల విస్తరణ, అవరోధాల తొలగింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, హైడ్రా ముందు నిలిచిన సవాళ్లు ఎంతో ఉన్నప్పటికీ, ప్రజల సహకారం, అధికారుల నిబద్ధత ఉంటే పరిష్కారాలు సాధ్యమేనన్న నమ్మకం కనిపిస్తోంది.

Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..

Exit mobile version