హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, కనుమరుగవుతున్న జలవనరులకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా గోల్కొండ కోట ప్రాంగణంలో ఉన్న 450 ఏళ్ల నాటి చారిత్రక జలవనరు ‘కటోరా హౌజ్’ పునరుద్ధరణకు హైడ్రా తన పూర్తి సహకారాన్ని ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ (ASI) సంరక్షణలో ఉన్న ఈ కటోరా హౌజ్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జలవనరు ప్రస్తుతం చెత్తాచెదారంతో, మురుగునీటితో నిండి ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దీనిని కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కటోరా హౌజ్ పునరుద్ధరణ కోసం ముందుకు వచ్చిన ‘నిర్మాణ్’ అనే ఎన్‌జీవో ప్రతినిధులను రంగనాథ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ జలవనరును సంరక్షించే ప్రణాళికలో భాగంగా, మొదట ట్యాంక్‌లోకి ఎవరూ చెత్త వేయకుండా చుట్టూ ఎత్తైన ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల నీటి నాణ్యతను కాపాడటమే కాకుండా, ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉండేలా చూడవచ్చు. అలాగే, సందర్శకులను ఆకట్టుకునే విధంగా జలవనరు చుట్టూ అందమైన పాత్‌వేను (నడక దారి) అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల గోల్కొండ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇదొక చక్కని ఆధ్యాత్మిక , చారిత్రక అనుభూతిని అందిస్తుంది.
ప్రస్తుతం కటోరా హౌజ్‌లో ఉన్న ప్రధాన సమస్య మురుగునీటి ప్రవాహం. ఈ చారిత్రక జలవనరు గుండా వెళ్తున్న మురుగునీటి పైప్‌లైన్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడాలని, మురుగు నీరు జలవనరులోకి చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులకు స్పష్టం చేశారు. చారిత్రక జలవనరుల సంరక్షణ అనేది కేవలం పర్యాటక అభివృద్ధికి మాత్రమే కాకుండా, భూగర్భ జలాల పెంపునకు , నగర వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఆర్కియాలజీ శాఖ , ఇతర స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కటోరా హౌజ్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చే వరకు హైడ్రా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఈ సందర్భంగా స్పష్టమైంది.
