హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో అపరిశుభ్రతపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝుళిపించారు. పోలీసులతో కలిసి 5 ప్రత్యేక బృందాలు క్యూర్ రీజియన్ పరిధిలోని 10 ఆహార విక్రయ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో పలు చోట్ల దారుణమైన అపరిశుభ్ర వాతావరణం బయటపడింది.
వంటగదుల్లో బొద్దింకలు, ఈగలు విపరీతంగా ఉండటం, ఫ్రిజ్‌లలో వెజ్. నాన్-వెజ్ పదార్థాలను కలిపి ఉంచడం, మురుగు కాలువలు మూసుకుపోవడం, కనీస రికార్డులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్, వెంగళరావు నగర్‌లోని పందెం కోడి రెస్టారెంట్, జూబ్లీహిల్స్‌లోని లహం హౌస్, గౌలిదొడ్డిలోని స్పైస్ కిచెన్ రెస్టారెంట్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. ఆల్ఫా హోటల్ స్టోర్ రూమ్‌లో పక్షుల రెట్టలు, కిచెన్ పైకప్పు పెచ్చులూడటం వంటివి కనిపించగా, స్పైస్ కిచెన్‌లో ఏకంగా వంటగదిలోనే వాష్‌రూమ్ ఉండటాన్ని అధికారులు పరిగణించారు.
అలాగే.. ఎలాంటి లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్రంగా నడుపుతున్న కూకట్‌పల్లి రాజీవ్ నగర్‌లోని న్యూ బ్లూ స్టార్ రెస్టారెంట్, పంజాగుట్టలోని శ్రీనివాస బాయ్స్ హాస్టళ్లను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ రెండు సంస్థలతో పాటు నిజాంపేట్ కేపీఎన్ ఫ్రెష్, బంజారాహిల్స్ లవాజత్ హైదరాబాద్ వాలా, శేరిలింగంపల్లి ప్రిన్స్ అరేబియన్ రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సికింద్రాబాద్ ఎస్‌డీ రోడ్‌లోని తత్వ రెస్టారెంట్‌కు లోపాలు సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ఈ దాడుల్లో సుమారు 300 కిలోల నాణ్యత లేని ఆహారాన్ని సీజ్ చేసి పారవేశారు. లైసెన్సులు రద్దయిన 4 హోటళ్లను ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గీ, జొమాటోల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

