Site icon NTV Telugu

AV Ranganath : నాలాపై ఉన్న 145 ఇళ్లు.. అడ్డుగా ఉన్న ఇళ్లు తొలగిస్తాం..!

Hydra Commissioner Av Ranganath

Hydra Commissioner Av Ranganath

AV Ranganath : హైదరాబాద్‌ ఆదివారం రాత్రి భారీ వర్షాలతో వణికిపోయింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వాన కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ఫ్లాష్‌ఫ్లడ్స్‌ కారణంగా రోడ్లు, కాలనీలు వరద నీటితో నిండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆసిఫ్‌నగర్‌లోని మాంగర్‌బస్తీ ప్రాంతం అతలాకుతలమైంది. వరద నీటికి ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

జిల్లా కలెక్టర్‌ హరిచందన, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తక్షణమే రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు జరిగిన ఇబ్బందులను తెలుసుకొని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి స్పష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

CM Revanth Reddy :ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపు చర్చలపై కీలక మలుపు

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్‌బస్తీ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి కబ్జాలు ఉండటం వల్లే ఫ్లాష్‌ఫ్లడ్స్‌ రూపంలో విపత్తులు సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. మాంగర్‌బస్తీ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా వ్యవస్థ ప్రాధాన్యత ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమవుతోందని రంగనాథ్‌ వివరించారు. అంతేకాదు, ఈ మోడల్‌ను చూసి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా హైడ్రా తరహా వ్యవస్థ అవసరమన్న డిమాండ్‌ వస్తోందని తెలిపారు.

మాంగర్‌బస్తీ పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో 145 ఇళ్లు నాలాపైనే నిర్మించబడ్డాయని తెలిపారు. స్థానికులు ముందుకొస్తే, వారికి ప్రభుత్వ పథకంలో అందించే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కూడా దీనిపై స్పందిస్తూ, మాంగర్‌బస్తీ సమస్యకు వారంరోజుల్లో పరిష్కారం చూపుతామని చెప్పారు. నాలాకు అడ్డుగా ఉన్న నాలుగైదు ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు.

అయితే, అన్ని ఇళ్లను తొలగిస్తారని భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల ఇళ్లను కూల్చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.
మాంగర్‌బస్తీ ఘటనతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. నాలాల కబ్జాలు, అనధికార నిర్మాణాలు, వర్షాకాలంలో పునరావృతమయ్యే వరద సమస్యలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులు తేల్చుకున్నారు. వచ్చే వారాల్లో స్పష్టమైన చర్యలు అమలులోకి వస్తాయని, ప్రజలు నమ్మకంగా ఉండాలని సూచించారు.

Telanagana : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల బంద్, ఇబ్బందుల్లో విద్యార్థులు.

Exit mobile version