Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్

Eagle Force

Eagle Force

Eagle Force: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE Force) ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్‌ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ఓ నివాస గృహం కేంద్రంగా సాగుతున్న అక్రమ గంజాయి దందాను ఈగిల్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీ అనే వృద్ధురాలిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గంజాయి కొనడానికి వచ్చిన దాదాపు 70 మంది వినియోగదారులను గుర్తించారు. ఫతేనగర్‌లోని నివాసంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఈగిల్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ బృందం రాత్రి వేళ ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో నిందితురాలి వద్ద నుంచి 179.1 గ్రాముల బరువు గల 41 చిన్న గంజాయి ప్యాకెట్లు, రూ. 43,340 నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు చిన్న చిన్న పొట్లాలుగా మార్చి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ నివాసంతో సంబంధం ఉన్న 70 మంది గంజాయి వినియోగదారులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా, 66 మందికి గంజాయిలోని ప్రధాన మత్తు పదార్థమైన ‘టీహెచ్‌సీ’ (THC) పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుర్తించిన వారిలో 65 మందిని వివిధ డీ-అడిక్షన్/పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ దందాలో అరెస్టయిన వృద్ధురాలితో పాటు మరో ఐదుగురు సహచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మున్నీ బేగం, ఇమ్రాన్, హనీఫా బీ, ఖాజా బీ అలియాస్ గిడ్డి, షేక్ ఖాజా పాషా పరారీలో ఉన్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అరెస్టయిన నిందితురాలు షేక్ జథేన్ బీ (75)పై గతంలో బాలానగర్ (Cr.No.161/2017, 89/2024, 154/2024), సనత్‌నగర్ (Cr.No.782/2022), అమీర్‌పేట ఎక్సైజ్ (Cr.No.79/2024, 45/2025), బేగంపేట (Cr.No.275/2025) పోలీస్ స్టేషన్లలో ఏడు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదై ఉన్నాయి. మైనర్లకు గంజాయి సరఫరా చేయడం, విక్రయించడం తదితర నేరాలపై క్రైమ్ నం. 23/2026 కింద NDPS చట్టంలోని సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(A), 27(b) మరియు జువెనైల్ జస్టిస్ (JJ) చట్టంలోని సెక్షన్ 77 కింద కేసు నమోదు చేశారు. మైనర్లను చట్టపరమైన నిబంధనల ప్రకారం పునరావాసానికి పంపినట్లు అధికారులు తెలిపారు.