Historic Event : భారత వైద్యరంగం ఒక కొత్త మైలురాయిని అధిగమించింది. టెలీసర్జరీ పద్ధతి ద్వారా హైదరాబాద్‌లో కూర్చున్న ఒక వైద్యుడు, గుర్గావ్‌లోని కేవలం 16 నెలల చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ అసాధారణ ఘటన దేశ వైద్యరంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. గుర్గావ్‌కు చెందిన ఆ చిన్నారికి పుట్టుకతోనే మూత్రనాళంలో సమస్య ఉంది. దీనికి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స అవసరమైంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వి. చంద్రమోహన్, ఈ శస్త్రచికిత్సను తన కన్సోల్ నుండే ‘SSI మంత్ర’ అనే రోబోట్ సిస్టమ్ సహాయంతో నిర్వహించారు.
సుమారు ఒక గంట పాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ శస్త్రచికిత్స తర్వాత చిన్నారిని మరుసటి రోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అతి చిన్న వయసులో టెలీసర్జరీ చేయించుకున్న పేషెంట్ గా ఆ చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ అద్భుతమైన సంఘటన భవిష్యత్తులో వైద్యసేవలు ఎలా ఉంటాయో చూపిస్తోంది. ఇకపై మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సాంకేతికతను ఉపయోగించుకుని వైద్యులు ఎక్కడి నుంచైనా చికిత్స అందించగలుగుతారు. ఇది భారతదేశంలో వైద్య సేవల విస్తరణకు, అత్యాధునిక చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి రావడానికి ఒక గొప్ప ముందడుగు అని నిపుణులు చెబుతున్నారు.
