Site icon NTV Telugu

Operation Octopus : హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’..16 రాష్ట్రాల్లో వేట.. 139 మంది నేరగాళ్ల అరెస్ట్.!

Octopus

Octopus

సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు భారీ ఆపరేషన్‌ను చేపట్టారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించి, ఏకంగా 139 మంది సైబర్ నేరగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. డిజిటల్ అరెస్ట్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా అమాయక ప్రజలను నిలువునా ముంచేస్తున్న ముఠాలను పోలీసులు మట్టుబెట్టారు. అరెస్టయిన నిందితులు సుమారు 1,000 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు వివిధ రూపాల్లో ప్రజల నుంచి సుమారు 127 కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త తరహా మోసంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్‌కు భారత్ వార్నింగ్..

నేరగాళ్లు బాధితులకు ఫోన్ చేసి తాము ఈడి (ED), సిబిఐ (CBI), ఇన్కమ్ టాక్స్ (IT), లేదా ముంబై, ఢిల్లీ పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుంటున్నారు. “మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది” అని లేదా “మనీ లాండరింగ్ కేసులో మీరు నిందితులు” అని భయపెట్టి, గంటల తరబడి వీడియో కాల్స్‌లో ఉంచి (డిజిటల్ అరెస్ట్) భారీగా డబ్బులు లాగుతున్నారు. ఈ ఆపరేషన్‌లో ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లకు అక్రమ లావాదేవీల కోసం ‘మ్యూల్ అకౌంట్స్’ (Mule Accounts) అందించడంలో ఇతను కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తామంటూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వల వేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్‌కు పాల్పడిన నేరగాళ్లు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.

హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వారం రోజుల పాటు అత్యంత రహస్యంగా సాగిన ఈ ‘ఆపరేషన్ ఆక్టోపస్’ సైబర్ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించింది. ప్రజలు ఎవరైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

Indian Army: ‘‘ఈసారి ఆపరేషన్ సిందూర్ కన్నా దారుణంగా ఉంటుంది’’.. పాక్‌కు భారత్ వార్నింగ్..

Exit mobile version