Police T20 Cricket Tournament : తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు విభాగాల మధ్య క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో మూడో ఆల్ ఇండియా పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ను తెలంగాణలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 35 పోలీస్ జట్లు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఘనంగా ఏర్పాట్లు.. డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమీక్ష
ఈ జాతీయ స్థాయి టోర్నీని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. టోర్నీ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పోలీస్ క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని స్పష్టం చేశారు. క్రీడాకారుల రవాణా, నాణ్యమైన భోజనం, వసతి , భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు తెలంగాణ పోలీస్ అకాడమీలో వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
క్రీడా మైదానాలు, ప్రత్యేక కమిటీల నియామకం
టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ పోలీస్ క్రికెట్ పోటీల నిర్వహణ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అత్యుత్తమ మైదానాలను ఎంపిక చేశారు. మొత్తం 6 ప్రధాన క్రికెట్ మైదానాలతో పాటు, మరో 2 రిజర్వ్ మైదానాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొయినాబాద్‌లోని అజీజ్ నగర్‌లో క్రికెట్ మైదానాలను ఈ టోర్నీ కోసం ఎంపిక చేశారు. టోర్నీ సజావుగా సాగేందుకు అడ్మినిస్ట్రేషన్, రవాణా, మీడియా, భద్రత, సాంకేతిక అంశాలు, మ్యాచ్‌ల సమన్వయం , ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఈ జాతీయ టోర్నీని విజయవంతం చేయాలని డీజీపీ పిలుపునిచ్చారు.

