హుజురాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ అభ్యర్ధి ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు.. కానీ, పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందనే లెక్కలు వేస్తోంది. దీంట్లో భాగం… మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొండా సురేఖ సుముఖంగా ఉన్నారా, లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో బరిలో దిగితే.. భవిష్యత్ ఎలా ఉంటుందనే ఆలోచన కూడా కొండా ఫ్యామిలీ చేస్తున్నట్టు సమాచారం. కొండా సురేఖను బరిలో నిలిపితే.. నాన్ లోకల్ అనేది సమస్యగా మారే ప్రమాదం ఉంది.
Read Also : “బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ క్వారంటైన్ అప్పటి నుంచే…?
ఇక అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి పెరుపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. లేదంటే దామోదర రెడ్డి కుమారుణ్ణి బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఆయన అధికార టీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ లోకి వస్తారా..? అనే టాక్ కూడా ఉంది. అభ్యర్ధి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండాలనుకుంటే.. హుజురాబాద్ కిసాన్ కాంగ్రెస్ సెల్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. దళిత సామాజికవర్గంకి చెందిన.. కరీంనగర్ dcc అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా పరిశీలనలో ఉంది. మొత్తంమీద అన్ని సమీకరణాలపై చర్చలు జరుపుతోంది హస్తం పార్టీ. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోరు ఉన్న ఈ ఎన్నికను.. కాంగ్రెస్ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోయినా.. తమ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చూస్తోంది.
