Real Estate Shock: హైదరాబాద్‌లో ఎప్పుడూ హాట్ కేకుల్లా అమ్ముడయ్యే కోకాపేట, మూసాపేట భూములకు ఈసారి గట్టి షాక్ తగిలింది. హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల ఈ-వేలంలో కనీసం ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇక్కడ భూమి దక్కించుకోవడానికి బడా రియల్టర్లు, ఇన్వెస్టర్లు పోటీ పడి వందల కోట్లు కుమ్మరించేవారు. కానీ తాజాగా ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా వేలం నిర్వహించినా ఒక్క బిడ్డర్ కూడా ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హెచ్ఎండీఏ అధికారులు ఈ-వేలాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అధికారులు నిర్ణయించిన భారీ కనీస ధరలే ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వేలంలో భాగంగా మూసాపేట ట్రక్ పార్క్ వద్ద ఉన్న 3.15 ఎకరాల భూమికి ఎకరా కనీస ధరను రూ.99 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లోని 4.59 ఎకరాల భూమికి ఎకరా కనీస ధర ఏకంగా రూ.120 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ స్థాయిలో ధరలు పెట్టి భూములు కొనుగోలు చేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇన్వెస్టర్లు ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
నిజానికి హెచ్ఎండీఏ వేలానికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇది కొత్తేమీ కాదు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని హుడా హైట్స్ భూములకు నిర్వహించిన ఈ-వేలాన్ని కూడా సరైన స్పందన లేకపోవడంతో అధికారులు వాయిదా వేయాల్సి వచ్చింది. వరుసగా ఖరీదైన ప్రాంతాల్లోని భూముల వేలానికి ఇన్వెస్టర్లు దూరంగా ఉండటం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొన్న మందగమనానికి అద్దం పడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో హెచ్ఎండీఏ కనీస ధరలను తగ్గించి మళ్లీ వేలం నిర్వహిస్తుందా లేదా అనేది చూడాలి.

