మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరియమ్మ మృతి పై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది హై కోర్టు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే.. జరుగుతోందని.. ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతి పై విచారణ ముగించిన హై కోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది.
మరియమ్మ కస్టోడియల్ మృతి పై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం లేదని… దాఖలైన పిల్ పై హై కోర్టు విచారణ ముగించింది. కాగా, యాదాద్రి భువన గిరి జిల్లా అడ్డగూడురు పోలీసులు మరియమ్మను దొంగతనం కేసులో విచారణ చేశారు. స్టేషన్ కు తీసుకురాగా.. ఆమె అనారోగ్యానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. విచారణ లో చిత్ర హింసలు పెట్టడం వల్లే.. మరియమ్మ చనిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్ల పై వేటు పడిన సంగతి తెలిసిందే.
