పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో పాతబస్తీ లో టెన్షన్ నెలకొంది. గత రాత్రి నుంచి పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
నేడు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అలెర్ట్ అయ్యారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఇదిలా ఉంటే.. తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ చెప్పారు.
