NTV Telugu Site icon

Medaram Helicopter Services: హెలికాప్టర్ పై మేడారం టూర్

తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్​రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్​ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. జాయ్​రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర ను ఎంచక్కా ఆకాశం నుంచి చూడవచ్చు. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ అవకాశం ఉంటుంది. హనుమకొండ -మేడారం వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు షటిల్​ సర్వీస్​లు వున్నాయి.

షటిల్ సర్వీస్​తో.. 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. కరీంనగర్ -మేడారం, హైదరాబాద్-మేడారం, మహబూబ్​నగర్-మేడారం రూట్లలో చార్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 5 సీట్స్ ఉంటాయి. హెలికాప్టర్ సేవలు వినియోగించుకునే భక్తులకు వీఐపీ దర్శనం అందిస్తారు.

సర్వీసులు ఎలాగంటే..

జాయ్​రైడ్​ సర్వీస్​ద్వారా మేడారంలో గగన విహారం వుంటుంది. 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం చేయవచ్చు. ఇందుకోసం రూ.3,700 ధర చెల్లించాలి.

షటిల్​ సర్వీస్ హనుమకొండ -మేడారం వుంటుంది. కేవలం 20 నిమిషాల్లో జాతరకు వెళ్ళవచ్చు. అందుకోసం రూ.19,999 చెల్లించాలి.

చార్టర్ సర్వీస్ హైదరాబాద్-మేడారం అందుబాటులో వుంటుంది. ఇందులో 5 సీట్లుంటాయి. వీఐపీ దర్శనం అందుబాటులో వుంటుంది. ఇందుకోసం రూ.75,000 చెల్లించాలి.
కరీంనగర్ -మేడారం హెలికాప్టర్ సర్వీసు కావాలంటే రూ.75,000 చెల్లించాలి. మహబూబ్​నగర్-మేడారం సర్వీస్ కోసం రూ 1,00,000 ధర చెల్లించాలి.