మేడారం భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 13 నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తులను హెలికాప్టర్ ద్వారా మేడారం తీసుకువెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు భక్తులు తరలించేందుకు హెలిప్యాడ్ సిద్ధం చేసింది. ఇందుకోసం ఒక్కొక్కరికీ రూ.19,999 ధరను ఛార్జీగా నిర్ణయించింది. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అలాగే మేడారంలో జాయ్ రైడ్ (జాతర స్కై వ్యూ) టిక్కెట్ ధరను రూ.3,700గా నిర్ణయించింది. జాతర పరిసరాల్లో 8 నుంచి 10 నిమిషాల పాటు జాయ్ రైడ్ ఉంటుందని ప్రకటించింది. టిక్కెట్ల బుకింగ్ కోసం 94003 99999, 98805 05905 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించింది.
