తెలంగాణలో వర్షాలు మళ్లీ దంచికొడుతున్నాయి.. మునుపెన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో అన్నట్టుగా.. ఇప్పుడు దాదాపు 115 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేశాయి.. జులై, ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. జులై నెలలో కురిసిన వర్షాలకు ఊళ్లకు ఊళ్లే కొన్ని వారాల పాటు వరద ముంపునకు గురికాగా.. పూర్తిస్థాయిలో తేరుకోకముందే మరోసారి వర్షాలు అందుకున్నాయి.. దీంతో, మళ్లీ వరద ముంపు పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవగా.. ఆగస్టులో కూడా వానలు దంచికొట్టాయి.. ఇక, రాష్ట్రంలో గత పదేళ్ల సెప్టెంబరు నెలలో ఎన్నడూలేనంత అత్యధిక వర్షపాతం నమోదు అవుతోంది.. గత వారం రోజుల నుంచి వర్షాలు రాష్ట్రాన్ని వీడడంలేదు.. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు.. అంటే 24 గంటల వ్యవధిలో నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. రికార్డులు బద్దలైపోయాయి..
Read Also: Heavy Rain in Telangana- Ap states: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద
24 గంటల వ్యవధిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్లు వర్షం కురిసింది.. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3, ఎల్లారెడ్డిపేటలో 19.3, మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 18, టేక్మాలులో 17.9, కొల్చారంలో 17.6, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 16.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. అయితే, గత పదేళ్లలో సెప్టెంబర్ నెలలో ఒకేరోజులో 35.1 సెంటీమీటర్ల వర్షం కురవడం ఇదే తొలిసారి.. 2019 సెప్టెంబర్ 18న నల్గొండలో 21.8 సెంటీ మీటర్లు వర్షం నమోదు కాగా… 1908 నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం మాత్రం.. ఖమ్మం జిల్లా కోహెడలో 1996 జూన్ 17న 67.5 సెంటీమీటర్లు నమోదైంది.. ఇక, రెండో అత్యధిక రికార్డు 1983 అక్టోబర్ 6వ తేదీన నిజామాబాద్‌లో 35.5 సెంటీమీటర్లు కాగా.. తాజాగా ఆళ్లపల్లిలో 35.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది.. దీంతో.. 115 ఏళ్లలో ఇదే మూడో అత్యధికం వర్షపాతంగా వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.