Telangana Rain: నైరుతి రాకతో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఊరట లభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్ ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో 35 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండడంతో వాతావరణం కాస్త చల్లబడింది. అయితే నేడు, రేపు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. రేపు కూడా కొన్ని జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని షేక్‌పేటలో 52.2, సంగారెడ్డి పరిధిలోని మునిపల్లిలో 47.2, మెదక్ జిల్లా రామాయంపేటలో 61, కౌడిపల్లిలో 64 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నేడు, రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Read also: Tamilnadu : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, బస్సు ఢీ.. ఐదుగురు మృతి..
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్న రాత్రి కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ, బాచుపల్లి, జగద్గిరిగుట్ట, మల్కాజ్‌గిరి, మూసాపేట్, కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, జీడిమెట్ల, సూరారం, చింతల్, హైదర్ నగర్, కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో నేడు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. వర్షం సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్