Telangana Reservoirs: తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల వర్షాల కారణంగా భారీగా నీరు చేరుతున్నాయి. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదిలోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. దీనితో అధికారులు 40 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 2,15,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,51,000 క్యూసెక్కులు నమోదయ్యాయి. పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1086.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 66.937 టీఎంసీల నిల్వ ఉంది.
USA క్రికెట్ బోర్డు సభ్యత్వం సస్పెండ్.. ICC కీలక నిర్ణయం
అలాగే సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ఎగువ వర్షాల కారణంగా అధికారులు 7 స్పిల్ వే గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 59,067 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 58,870 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 16.624 టీఎంసీలుగా ఉంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో అధికారులు 13 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 56,289 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,01,351 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1402.34 అడుగుల వద్ద నీటి మట్టం నిల్వ ఉంది. పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 14.123 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీ వరద చేరింది. అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత కారణంగా లోయర్ జూరాల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత ఇన్‌ఫ్లో 2,87,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,02,393 క్యూసెక్కులు. పూర్తి నీటి మట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1042.585 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.184 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Crime News: సినిమా స్టోరీకి మించిన కథ.. దోపిడీ ముసుగులో భార్యను కిరాతకంగా చంపించిన భర్త!
ఇక నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 18 క్రస్ట్ గేట్లు 10 అడుగులు, 8 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 3,68,119 క్యూసెక్కులుగా ఉన్నాయి. పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 586.50 అడుగులుగా ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 303 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఇదే జిల్లాలోని మూసి ప్రాజెక్టుకు కూడా వరద నీరు చేరింది. అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 10,741 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 9,501 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 643.59 అడుగుల వద్ద ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.
