కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.. అయతే, నిన్న హోంశాఖమంత్రి మహమూద్ అలీ.. పోలీసులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం.. లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమంటూ ప్రకటించడంతో.. ఈ నెల 30 తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ తప్పదా? అనే చర్చ మొదలైంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. అసలు లాక్‌డౌన్ పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఇక, రేపటి నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్‌లు ప్రారంభిస్తామన్న ఈటల.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని కీలక సూచనలు చేశారు..
మరోవైపు.. మందులు, ఆక్సిజన్ ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి ఈటల రాజేదర్.. రాష్ట్రంలో ఏపీ, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు చెందిన రోగులకు కూడా చికిత్స అందిస్తున్నామన్న ఆయన.. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో 1.75 కోట్ల మంది యువత ఉన్నారు.. మాకు రెండు డోసులకు 3.50 కోట్ల వ్యాక్సిన్లు కావాలన్న ఆయన.. వాక్సిన్ విషయంలో కేంద్రం పునరాలోచించాలన్నారు.. కేంద్రమే వాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ఇక్కడ ప్లాన్ చేస్తామన్నారు ఈటల. కరోనా ట్రీట్‌మెంట్‌లో ఆక్సిజన్ కీలకం.. ఇప్పటికి కేంద్రం 360 మెట్రిక్ టన్నులు కేటాయించింది.. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను తెలంగాణ కు కేటాయించాలని కోరారు.. కేంద్రం నియంత్రణ చేయటం కాదు.. రాష్ట్రాల అవసరాలు తీర్చాలన్న ఆయన.. కావాల్సిన అవసరాలు తీర్చటం కేంద్రం బాధ్యత.. అవసరం అయితే, రాష్ట్రాల షేర్ అడగండి అన్నారు..
కేంద్రం సెకండ్ వేవ్ వస్తోంది అని చెప్పింది.. కానీ, ఇంత తీవ్రంగా ఉంటుంది అని హెచ్చరించలేదన్న ఆయన.. తీవ్రంగా ఉండదనే ఎన్నికలు పెట్టారు కదా..? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం.. ఈ పరిస్థితిని దేశాల వారీగా చూస్తున్నారు.. రాష్టాల వారీగా చూడటం లేదన్న ఈటల.. కేంద్రం చెప్పిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాం.. మమ్మల్ని విమర్శిస్తోంది వాళ్లు.. విమర్శలకు సమాధానం చెబుతున్నాం అన్నారు. దేశం విపత్తు.. కేంద్రం పట్టించుకోవాలి.. కానీ, కొన్ని విషయాల్లో కేంద్రం స్పందన సరిగ్గా లేదన్నరు ఆరోగ్యశాఖ మంత్రి.