NTV Telugu Site icon

Telangana Govt: రాష్ట్రంలో ‘హెల్త్‌ కార్డు – డిజిటల్‌ రికార్డు’! కానీ.. ఏజ్ లిమిట్ ఉందండోయ్..

Telangana Govt

Telangana Govt

Telangana Govt: కాంగ్రెస్ సర్కార్ ఆరోగ్య రంగంలో మార్పు దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ డిజిటల్ మయం అవుతున్న తరుణంలో వైద్యారోగ్య శాఖ ద్వారా అందజేసే హెల్త్ కార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులు అందించాలని, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక నంబర్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. డిజిటల్ రికార్డుల తయారీ కార్యకలాపాల్లో భాగంగా వివిధ అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ రికార్డు ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని అందించి మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య, ఆరోగ్య శాఖకు ప్రాధాన్యత తదితర అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. వారు డిజిటల్ హెల్త్ కార్డ్‌లను రూపొందించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలపై పని చేస్తున్నారు.
హెల్త్ కార్డ్ ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం, వైద్య పరిస్థితులు, గతంలో వైద్యం, చికిత్స, వాడిన మందులు, సమస్య, వైద్యుల అభిప్రాయం తదితర వివరాలు డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి.

Read also: PM Modi influence on Pak: పాకిస్థాన్ ఎన్నికలపై మోడీ ప్రభావం.. ఆర్థిక సంక్షోభంపై కీలక ప్రకటన

రాష్ట్రంలో వైద్యం కోసం ఎక్కడికి వెళ్లినా.. ఈ వివరాలన్నీ వెంటనే ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులకు తెలుస్తాయని, తద్వారా మెరుగైన వైద్యం, వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్డును ఆరోగ్యశ్రీ, ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేస్తారు. ఎత్తు, పొడవు, బరువు వంటి వివరాలతో పాటు రక్త, మూత్ర పరీక్షలు చేసి వాటి ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి నమోదు చేస్తారు. బీపీ, మధుమేహం వంటి జబ్బులు, ఇతరత్రా ఏవైనా అనారోగ్య సమస్యలున్నా గుర్తిస్తారు. సమస్యలుంటే ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత రికార్డులను నమోదు చేసిన తర్వాత, వారికి అవసరమైన వైద్య సంరక్షణ అందించబడుతుంది. ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా హెల్త్ కార్డులో గుర్తింపు నంబరు నమోదు చేస్తే వెంటనే వివరాలు అందుతాయి. ప్రజల ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు, ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. డిజిటల్ డేటాను భద్రపరిచే నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఐటీ శాఖ సమన్వయంతో దీనిపై దృష్టి సారిస్తుంది. త్వరలో 18 ఏళ్లు పైబడిన వారికి హెల్త్ కార్డులు అందుతాయి.
MRO Ramanaiah Family: తహశీల్దార్‌ రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం

Show comments