రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇటీవల ఆకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆరుగాలం శ్రమించిన రైతన్నకు నిరాశే మిగిలింది. అయితే.. తాజాగా మరోసారి తెలంగాణకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రావొద్దని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, రైతులను ఆదుకునేందుకు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధరతో సేకరణ జరుపాలని ఆయన ఆదేశించారు.
అకాల వర్షాలతో ధాన్యం తడవొద్దని, రైతులు ఆగం కావొద్దన్న హరీష్ రావు.. అలా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులదే అని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేసి రైతుల్ని కాపాడుకుందామని, గ్రామాల వారీగా ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులకు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదే అని ఆయన అన్నారు.