రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం, ట్రూ అప్ చార్జీల భారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన విలేకరుల సమావేశం ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా సంబంధం లేని కాగితాలు చూపిస్తూ పత్రికా సమావేశం నుంచి తప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారులపై ‘ట్రూ అప్’ చార్జీల పేరిట రూ.5,420 కోట్ల మేర భారం మోపడంపై తాము ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకపోవడం కాంగ్రెస్ ‘ప్రజా పాలన’ నిర్లక్ష్యానికి నిదర్శనమని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) ద్వారా ధ్వజమెత్తారు. ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకొని పండుగ పూట శుభవార్త చెబుతారనుకుంటే, భట్టి గారు ఆ భారాన్ని ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తామని పక్కనే ఉన్న అధికారులతో చెప్పించడం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతోందన్నారు.
రైతుల ధర్నాలు కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం
రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవని ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని హరీష్ రావు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో సబ్ స్టేషన్ల ముందు, రోడ్లపై రైతులు ధర్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు. లో వోల్టేజ్ సమస్యల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోయి రైతాంగం తీవ్ర నష్టాలకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రిపూట పొలాల వద్ద కాపలా కాస్తూ పాముకాట్లకు గురై రైతులు ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కలేదని, మీరు తెస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
యాదాద్రి, సింగరేణి అంశాలపై ప్రభుత్వ వైఖరిపై ధ్వజం
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 14 MTPA G-9 గ్రేడ్ బొగ్గును యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు కేటాయించిన రికార్డులు ఉన్నప్పటికీ, కేటాయింపులు లేవని ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని హరీష్ రావు నిలదీశారు. ఎల్ నినో సాకు చూపి యాదాద్రిలో 3000 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్లు, కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమేనని మండిపడ్డారు. మన రాష్ట్ర విద్యుత్ అవసరాలను పక్కన పెట్టి, సింగరేణి నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. అలాగే ఎలాంటి పెట్టుబడి లేకుండా తక్కువ ధరకు 1600 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు ఎన్టీపీసీ ముందుకు వచ్చినా తిరస్కరించి, నేడు విద్యుత్ కోతలకు కారణమయ్యారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం నిజం కాదా అని, దీనిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
భారం ఉపసంహరించుకోకపోతే పోరాటాలు తప్పవు
సింగరేణి సహా విద్యుత్ సంస్థలను ఐపీఓలకు, అప్పుల వైపు మళ్లించేందుకు ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పత్రికా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలపై నిందలు వేసినంత మాత్రాన ప్రజల కరెంట్ కష్టాలు తీరవని హరీష్ రావు హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని , ప్రజలపై మోపిన రూ.5,420 కోట్ల ట్రూ అప్ చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజలు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.

