మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాత రోజులు మళ్లీ తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజంగానే కరెంట్ కోతలు, మందులు లేని ఆసుపత్రులతో ఆ చీకటి రోజులను మళ్లీ తీసుకొచ్చారని విమర్శించారు.
సింగరేణి ప్లాంట్ రాజస్థాన్‌కు విక్రయం.. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ పొందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రాజస్థాన్ రాష్ట్రానికి అమ్మేందుకు ఒప్పందం చేసుకుందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. మొదట్లో 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు బొగ్గు లేదనే నెపంతో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో ఏకంగా 2,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సరిపడా మందులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం నీళ్లు, రుణమాఫీపై ఘరానా మోసం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేస్తే నర్సాపూర్ ప్రాంతానికి పారక నీరు వస్తుందని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగున్నాయని ఎన్డీఎస్ఏ (NDSA) స్పష్టం చేసినప్పటికీ నీటిని పంపింగ్ చేయడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు చూస్తే ప్రజలకు కేసీఆర్ గుర్తుకొస్తారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నీటిని పంపింగ్ చేయడం లేదని విమర్శించారు. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, మూడేళ్లు గడుస్తున్నా రుణమాఫీ పూర్తి చేయకుండా రైతులను ఘరానా మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: రేవంత్‌కు సవాల్
రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కేసీఆర్ రూ. 19,500 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. ఈ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం రూ. 500 కోట్లు కూడా ఇవ్వలేదని ఆరోపించిన ఆయన, విద్యార్థులకు ఎంత ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారో ధైర్యముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను ప్రజలు ఇక ఏమాత్రం నమ్మరని స్పష్టం చేశారు.

