Site icon NTV Telugu

Harish Rao : గత పాల‌కులు ఏనాడూ ప్రజా వైద్యాన్ని ప‌ట్టించుకోలేదు

5th Day Telangana Assembly Budget Sessions 2022 Updates.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి పాల‌న‌లో ప్రభుత్వ వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటును ప్రోత్స‌హించారని ఆయన అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీ పాల‌కులు ఏనాడూ ప్ర‌జా వైద్యాన్ని ప‌ట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ఆసుప‌త్రులు పెరిగిపోయాయని, ప్రజ‌లు ప్ర‌తి ఆరోగ్య స‌మ‌స్య‌కు ప్రైవేటును ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి ఉండేదన్నారు. పేద‌లు వైద్యంపై అధికంగా ఖ‌ర్చు చేసి ఆర్థికంగా చిక్కిపోయేవారని, ఏదైనా పెద్ద రోగం వ‌స్తే అప్పులు చేసి ప్రాణాలు కాపాడుకోవాల్సిన ప‌రిస్థితులు ఉండేవన్నారు.

ఈ ప‌రిస్థితుల‌ను మార్చేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకున్నామని, వైద్య రంగాన్ని బ‌లోపేతం చేశామన్నారు. గుణాత్మ‌క మార్పు సాధ్యం చేశామని, జిల్లాకొక మెడిక‌ల్ కాలేజీ విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య అని ఆయన అన్నారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ‌లో మూడు మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే ఉంటే, ఇప్పుడు 17కు పెంచుకున్నామన్నారు. ఈ ఏడాది కొత్త‌గా మ‌రో 8, వ‌చ్చే ఏడాది మ‌రో 8 మెడిక‌ల్ కాలేజీలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలోనే అన్ని జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలువ‌బోతున్న‌దని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version