కాంగ్రెస్ నాయకులు తనపై చేసిన అసత్య ప్రచారాలను నిరసిస్తూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు కోర్టులో డీఫమేషన్ కేసు ఫైల్ చేశారు. తాను క్షుద్ర పూజలు చేశానంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఇవన్నీ పూర్తిగా ఆధారరహితమైన అబద్ధాలని ఆయన మండిపడ్డారు. అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం తన పిటిషన్‌ను స్వీకరించిందని, ఈ నెల 30వ తేదీ బుధవారం నాడు తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.
అసత్య ప్రచారాలు చేస్తే వదిలేది లేదు.. న్యాయపోరాటం చేస్తాం
హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా బాధ్యతారాహిత్యంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్ వంటి నాయకులు తనపై నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కూడా తనపై కానీ, తమ పార్టీపై కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేక, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత , సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైన ‘డైవర్షన్ పాలిటిక్స్’ కు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టు అని హరీశ్ రావు అభివర్ణించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకవైపు రాజ్యాంగ సంరక్షకుడిగా మాట్లాడుతారని, మరి ఆయన సొంత పార్టీనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకున్నప్పుడు ఆ రాజ్యాంగ సూత్రాలు ఏమయ్యాయని నిలదీశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాతైనా పార్టీ మారిన శాసనసభ్యులకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీకి నిజంగా రాజ్యాంగంపై గౌరవం ఉంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలందరి చేత వెంటనే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. దానం నాగేందర్‌కు ఎదురైన పరిస్థితే మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ ఎదురవుతుందని స్పష్టం చేశారు.
మూడేళ్లయినా డిప్యూటీ స్పీకర్ నియామకం లేదు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇంతవరకు అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. సభ హక్కుల ఉల్లంఘనపై బీఆర్ఎస్ తరఫున నోటీసులు ఇచ్చినప్పటికీ స్పీకర్ పట్టించుకునే పరిస్థితి లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకే స్పీకర్ వ్యవస్థను ఉపయోగించుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలును పూర్తిగా గాలికి వదిలేసి ప్రజలను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని హరీశ్ రావు తేల్చిచెప్పారు.

