NTV Telugu Site icon

Harish Rao : అదే సీఎం కేసీఆర్‌ సంకల్పం..

Harish Rao

Harish Rao

గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంద‌రికీ ప్ర‌భుత్వ సేవ‌లు సులువుగా అందాల‌న్న‌దే సీఎం కేసీఆర్ సంక‌ల్ప‌మ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమ‌ని, రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామ‌ని ఆయన వెల్లడించారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధికై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామ‌న్న హరీష్‌ రావు.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రుల కంటే గజ్వేల్ జిల్లా ఆస్ప‌త్రిలో వైద్య సేవలు బాగున్నాయి. ప్రయివేటు ఆస్ప‌త్రికి పోయి డబ్బులు వృథా చేసుకోవద్దని.. గజ్వేల్ ప్రభుత్వ ఆస్ప‌త్రికి వెళ్లాలని, ఆరోగ్య లక్ష్మీ పథకం సేవలు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు మంత్రి హరీష్‌రావు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్మ‌న్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.