Site icon NTV Telugu

Telangana : అలర్ట్.. ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

Students Rain

Students Rain

Telangana : మొంథా తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమయ్యారు.

జిల్లా కలెక్టర్లు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సంయుక్తంగా సమీక్ష నిర్వహించి, వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రేపు (గురువారం) సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ నిర్ణయానికి లోబడుతాయి. అలాగే వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు.

తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. హన్మకొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో వాగులు పొంగి రహదారులు తెగిపోయాయి.

కొందరు గ్రామాలు రోడ్డు మార్గం ద్వారా సంబంధాలు కోల్పోయాయి. స్థానిక ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Kishan Reddy : ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం

Exit mobile version