తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఎస్‌సీ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. బుధవారం ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్ టికెట్లు పంపినట్లు ఆయన తెలిపారు. అయితే.. పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చనీ, అలాగే www.bse.telangana.gov.in నుంచి సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ పేర్కొన్నారు.
ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. ఈ పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
