NTV Telugu Site icon

Gujjula Ramakrishna Reddy: బీజేపీలో వర్గ విభేదాలు.. సురేష్ రెడ్డిపై వ్యతిరేక తీర్మానం

Gujjula Ramakrishna

Gujjula Ramakrishna

Gujjula Ramakrishna Reddy Fires on Suresh Reddy: తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రధాని మోడీ పర్యటనకు ఆహ్వానం అందలేదన్న కోపంతో.. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సురేష్ రెడ్డిపై వ్యతిరేక తీర్మానం చేసి, పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కొత్తగా వచ్చే ఆయారాం గయారాంలకు టికెట్‌లు ఇస్తామంటే, తాము ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. పెద్దపల్లిలో నిన్నగాక మొన్న వచ్చిన సురేష్ రెడ్డి, పార్టీ కార్యక్రమాలను ఇష్టారీతిన చేస్తే ఊరుకోమని మండిపడ్డారు. మొదటి నుండి కార్యకర్తలు తమ చెమట, రక్తం ధారపోసి పార్టీని ముందుకు నడిపించారని.. ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతున్న సమయంలో నక్కలు వచ్చి మాదే టికెట్ అంటే చూస్తూ ఉరుకుంటామా? అని నిలదీశారు.

సురేష్ రెడ్డి తమకంటే పెద్ద వ్యక్తా? అని ప్రశ్నించిన గుజ్జుల రామకృష్ణ రెడ్డి.. కాంగ్రెస్‌లో ఉంటూ అభ్యర్థికి సహకరించని వ్యక్తి, బీజేపీలో సహకరిస్తాడా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లనే పార్టీ సపోర్ట్ చేస్తే.. తమ ఆలోచనలకు తమకు ఉంటాయని హెచ్చరించారు. పెద్దపల్లిలో తానొక్కడినే ఓడిపోలేదని.. పార్టీ అభ్యర్థులందరూ 118 స్థానాల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయాల వల్ల 107 స్థానాల్లో డిపాజిట్‌లు కోల్పోయామన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ పోరాడుతోందన్నారు. అక్రమాలపై నిన్నటి నుండి కరీంనగర్‌లో ఈడీ దాడులు అవుతున్నాయని చెప్పారు. బీజేపీపై ప్రజల్లో క్రమంగా విశ్వాసం పెరుగుతోందని.. ఇలాంటి సమయంలో పార్టీలో కొందరి నిర్ణయాలు పార్టీ నష్టపోతోందని పేర్కొన్నారు.