తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం.. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ఎదురుచూశారు.. ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఆ మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు తెలంగాణ మంత్రులు.. ఖరీఫ్‌కు సంబంధించి తెలంగాణలో పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం..
ఈ మేరకు కేంద్రం నుంచి తెలంగాణ పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణ లక్ష్యం పెంచినట్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 20.9.2021న రాసిన లేఖపై కేంద్రం స్పందించింది.. బియ్యం సేకరణ లక్ష్యం పెంపుదలకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు లేఖలో పేర్కొన్నారు.. మొత్తంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహారశాఖ సమాచారం ఇచ్చింది. అంటే.. 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుంది కేంద్రం. ఇక, కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరిధన్యాన్ని సేకరించనుంది తెలంగాణ ప్రభుత్వం.