NTV Telugu Site icon

రేపే కోకాపేట భూముల వేలం..

Lands Auction

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ భూముల వేలానికి రంగం సిద్ధమైంది. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో భూముల వేలానికి మార్గం సుగ‌మం అయ్యింది.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు చేస్తుండ‌గా.. భూముల వేలంపై హైకోర్టును ఆశ్ర‌యించారు బీజేపీ నేత‌ విజయశాంతి.. ఇక‌, ఆమె దాఖలు చేసిన పిల్ పై విచార‌ణ చేప‌ట్టింది హైకోర్టు.. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టివేయాలని విజయశాంతి కోరారు.. అయితే, నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున వేలం వేస్తున్నామ‌ని కోర్టుకు తెలిపారు ఏజీ.. అయితే, భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంకు ఏర్పాటుపై పూర్తిస్థాయి వాదనలు వింటామ‌ని పేర్కొంది..

భూముల వేలాన్ని ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించ‌డంతో.. ఆన్‌లైన్‌లో భూముల వేలాన్ని నిర్వ‌హించ‌నుంది కేంద్ర‌రంగ సంస్థ ఎంఎస్‌టీసీ.. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు. కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వేలం ద్వారా హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ భూముల అమ్మకం ద్వారా 5000 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. కోకాపేటకు చెందిన భూమిని 8ప్లాట్లు చేసింది. ఈ 8 ప్లాట్లలో ఉదయం 4 ప్లాట్లు, మధ్యాహ్నం తర్వాత 4 ప్లాట్లు వేలం వేయనున్నారు. రెండో రోజు ఆన్ లైన్ బిడ్డింగ్ లో టీఎస్ఐఐసీకి చెందిన 30 ఎకరాలు 6 ప్లాట్లు వేలానికి వేయనున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఆన్ లైన్ బిడ్డింగ్ లో పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు.