ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ తీపికబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం (డీఏ)పై కీలక నిర్ణయం తీసుకుంటూ.. వివరాలను ప్రకటించింది. వచ్చే వేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు, మూల వేతనంపై 5 శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుందని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుండగా, ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు తెలిపారు.
అయితే 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేయడం, ఆ తరువాత కరోనా ప్రభావంతో ఆర్టీసీ మరింత దెబ్బతింది. అయితే ఓ సమయంలో ఆర్టీసీని ప్రైవేటీకరించే స్థాయిలో కూడా మంతనాలు జరిగాయి. అయితే ఆ తరువాత ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ఆ నాటి నుంచి సజ్జనార్ తనదైన శైలిలో ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రజలు దృష్టిని ఆర్టీసీ వైపు మల్లించేందుకు వినూత్న కార్యక్రమాలను తీసుకువచ్చారు.
