ఈ రోజు GHMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై చర్చ కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మునిసిపాలిటీలతో పాటు, ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు మరియు నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చల సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దారుస్సలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ కార్పోరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పోరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బీజేపీ కార్పోరేటర్లు గెజిటెడ్ పత్రాలను చింపి సభలో విసిరివేసి, మేయర్ పోడియం వైపు దూసుకెళ్లారు. దీనిపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య పునర్విభజనపై కార్పోరేటర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని మేయర్ ప్రకటించారు. అనంతరం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సభ వాయిదా అనంతరం బీజేపీ కార్పోరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్ ఎంఐఎంకు అనుకూలంగా వార్డుల విభజన చేపట్టిందని, జీహెచ్ఎంసీ విడుదల చేసిన మ్యాప్ తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
U19 Asia Cup 2025: అభిజ్ఞాన్ డబుల్ సెంచరీ, ఐదేసిన దీపేశ్.. చిత్తు చిత్తుగా ఓడిన మలేషియా!