GHMC : భాగ్యనగరవాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తీపి కబురు అందించారు. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను (Property Tax) బకాయిలు ఉన్న వారికి ఊరటనిస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఆస్తులపై భారీగా వడ్డీ (Arrears Interest) పేరుకుపోయింది. పన్ను చెల్లింపుదారుల విజ్ఞప్తి మేరకు, 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రాయితీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ పథకం ప్రకారం.. పన్ను చెల్లింపుదారుడు తన అసలు పన్ను మొత్తాన్ని (Principal Amount) చెల్లిస్తూ, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతాన్ని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా మాఫీ చేస్తుంది.
ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ కేవలం ప్రైవేట్ వ్యక్తులకు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల పరిధిలోని ఆస్తులన్నింటికీ ఈ రాయితీ వర్తిస్తుంది. పన్ను బకాయిలు ఉన్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా అటు ప్రజలకు వడ్డీ భారం తగ్గుతుందని, ఇటు జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా సంబంధిత సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లించి ఈ 90% వడ్డీ మాఫీని పొందవచ్చు.
Pawan Kalyan: అందుకే మనకు ప్రధానితో సహా జాతీయ స్థాయిలో గౌరవం..!
