హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి.
అయితే పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం వుడెన్ కలర్‌తో రూపొందించిన ఈ బ్రిడ్జి పంజాగుట్ట సర్కిల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మరో 6 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను రాబోయే 4 నుంచి 6 వారాల్లో ప్రారంభించనున్నట్లు పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అయితే.. నేడు నార్సింగిలో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.. శేరిలింగంపల్లి, అల్వాల్, కుషాయిగూడ, పఠాన్ చెరువు, మలక్ పేట్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, నార్సింగి ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్స్ ప్రారంభించారు మంత్రులు. కాగా.. మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించాల్సిన గోల్కొండ డయాగ్నోస్టిక్ మినీ హబ్ ప్రారంభం వాయిదాపడింది. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిదుద్దీన్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదావేశారు అధికారులు.
