మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్‌లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వచ్చిన ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించిన శేఖర్, నవీన్, కరీం అనే యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.
నిజామాబాద్ నగరంలో పుననిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి యువతిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెబుతున్నారు.. మంగళవారం రాత్రి ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోగా.. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ఘటనపై కేసు నమోదు చేశారు నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు.. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురు యువలకును అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటనపై సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు నిందితులను పట్టుకున్నాం.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాం.. నిందితుల్లో కొందరు యువతిపై అత్యాచారం చేయగా మరికొందరు సహరించినట్టు తెలిపారు.
