గాంధీ ఆసుపత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపింది. అయితే పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, కేవలం గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. పసికందును కిడ్నాప్ చేసిన ముఠా సభ్యులు ఆ చిన్నారిని లక్ష రూపాయలకు విక్రయించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ డీసీపీ టీమ్ ఆరుగురిని అరెస్ట్ చేసింది.
మాయమాటలతో ట్రాప్.. డబ్బు ఆశ చూపి ఎత్తుకెళ్లిన ముఠా
బిహార్‌కు చెందిన ఓ మహిళ కొన్ని రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడో కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టడంతో ఆ ముఠా ఆ మహిళను ట్రాప్ చేసింది. ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయని, తాము ఆ డబ్బులు ఇప్పిస్తామని నమ్మించి ఏడు రోజుల పసికందును ఎత్తుకెళ్లింది. నిందితులు చిన్నారిని కిడ్నాప్ చేసి లక్ష రూపాయలకు అమ్మేశారు.
ప్రత్యేక బృందాలతో వేగవంతమైన గాలింపు
కిడ్నాప్ సమాచారం అందిన వెంటనే సికింద్రాబాద్ డీసీపీ రక్షితా మూర్తి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు బృందాలు వేగంగా గాలింపు చర్యలు చేపట్టి, గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. మిగిలిన కోణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

