NTV Telugu Site icon

DOUBLE DECKER BUS: హైదరాబాదీలకు డబల్ ధమాకా… ఆ బస్సుల్లో జర్నీ ఫ్రీ ఫ్రీ.

Dabul Dekker Bus

Dabul Dekker Bus

DOUBLE DECKER BUS: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగరానికి వచ్చే ప్రజలు వాటిని ఆసక్తిగా చూడటమే కాకుండా వాటిలో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. కాలక్రమంలో ఆ బస్సులు మాయమయ్యాయి. అయితే ఆ బస్సులను వెనక్కి తెస్తే బాగుంటుందని కొన్నాళ్లుగా నెటిజన్లు మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో అడుగుతున్నారు. నెటిజన్ల వినతికి ఓకే చెప్పిన మంత్రి కేటీఆర్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. రూ. 12 కోట్లతో హెచ్‌ఎండీఏ సహకారంతో నగరంలో మొత్తం 6 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు.

ఈ డబుల్ డెక్కర్ బస్సులు రెండు నెలల నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్ లలో తిప్పుతున్నారు. ఈ బస్సులు మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9:30 వరకు నడుస్తాయి. ‘జాయ్ రైడ్’ పేరుతో ఈ బస్సులు ఉచితంగా తిరుగుతున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఈ బస్సులు ఏయే రూట్లలో నడుస్తున్నాయో తెలియక జనం ఎక్కలేకపోతున్నారు. సరైన రూట్ మ్యాప్ ఉంటే ప్రయాణికులు ఎక్కేందుకు ఆసక్తి చూపుతారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read also: Warangal News: 24 అంతస్తుల్లో వరంగల్ హెల్త్ సిటీ! ప్రత్యేకతలు ఇవే

ఈ నేపథ్యంలో పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేసింది. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్క్, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో తిరుగుతాయి. ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలుదేరి ఆయా రూట్లలో తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు. ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్క్ వద్ద చార్జింగ్ కోసం ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేసినట్లు హెచ్ ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ బస్సుల్లో ప్రయాణం ఉచితం. టికెట్ అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చు. కొద్దిరోజుల తర్వాత మినిమమ్ ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే టికెట్ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది ఇంకా ఖరారు కాలేదు. పర్యాటకుల స్పందన మేరకు మరికొన్ని మార్గాలను ఎంపిక చేయనున్నారు.