Four people died due to an elusive disease in Karimnagar district: కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. అంతుచిక్కని వ్యాధితో కుటుంబంలోని సభ్యులు వరసగా మృతిచెందారు. నెల రోజు వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన ఓ కుటుంబంలో అంతుచిక్కని వ్యాధి పెను విషాదాన్ని నింపింది. 40 రోజుల్లో శ్రీకాంత్, భార్య మమతతో పాటు కూతురు అమూల్య(6), అద్వైత్(20 నెలలు) ఒకరి తరువాత ఒకరు మరణించారు.
వీరంతా వాంతులు చేసుకుంటూ చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే వ్యాధి ఏంటనేది ఇప్పటికీ తెలియడం లేదు. ఈ మాయదారి రోగం వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. మరణించిన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను హైదరాబాద్ లోని ల్యాబుకు పంపించారు. గంగాధర పోలీసులు ఈ మిస్టరీ డెత్స్ పై విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా శ్రీకాంత్ భార్య, పిల్లలు వరసగా మరణించారు. ఆ తరువాత శ్రీకాంత్ కూడా ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించే ముందు శ్రీకాంత్ వాంతులు చేసుకుంటూ ప్రాణాలు వదిలారు. అంతకుముందు భార్య, పిల్లలు కూడా ఇదే తరహాలో మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అయితే ఏ వ్యాధితో మరణించారో తెలియక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి
నెత్తురోడిన రోడ్డు:
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడి పేట ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న తండ్రి కొడుకులను వెనక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కొడుకు శివచరణ్ మరణించగా.. తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి.
తమిళనాడు చెంగల్పట్టు జిల్లా మధురాంతకం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది మహిళాభక్తులకు గాయాలయ్యాయి. వీరంతా మేల్మరువత్తూర్ ఆలయ సందర్శన కోసం సేలం వెళ్తుండగా ఘటన జరిగింది.