సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలోని రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టుని కాంగ్రెస్ పార్టీ ఒక టీఎంసీ కోసం ఆలోచించిందని, ఇప్పుడు మనం 8.23 టీఎంసీలుగా మార్చామని ఆయన వెల్లడించారు. భూ నిర్వాసితులకు 98 శాతం పరిహారం అందించామని ఆయన తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ అప్పు చేశాడు అని ఆరోపిస్తున్నారని, అప్పుచేసి కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
విపక్షాలు ఉన్నత పాత్ర పోషించకుండ.. రాజకీయ లబ్ది కోసం పాటుపడుతున్నాయని ఆయన విమర్శించారు. వరి కొనుగోలులో కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రాల్లో లేవని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, కేసీఆర్ ఆలోచన భావితరాల భవిష్యత్తుకు పునాది అని ఆయన అన్నారు.