కొంతకాలం నుంచి సందిగ్ధతకు తెరదించుతూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అయితే.. ఎర్రశేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు. ఈ చేరికకు దూరంగా ఉన్న ఆయన.. నేరచరిత్ర కలిగిన అతడ్ని కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తమ్ముడిని చంపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్రశేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం సరైంది కాదన్నారు. గాంధీ సిద్ధాంతాలు నమ్మే కాంగ్రెస్ పార్టీలోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. ఎర్రశేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే ఆలోచనల్లో ఉన్నారు. ఈయనతో పాటు జడ్చర్ల కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలావుండగా.. 1994లో ధన్వాడ ఎంపీపీగా ఎర్రశేఖర్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1995 ఆగస్టులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రెండోసారి కూడా విజయం సాధించారు. 2004లో మాత్రం ఓటమిపాలయ్యారు. 2009 టీడీపీ, టీఆర్ఎస్ మహాకూటమి సమయంలో మూడోసారి గెలుపొందారు. అయితే.. 2014, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరిన సుమారు ఏడాదిన్నర తర్వాత ఎర్రశేఖర్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. పార్టీ తరఫున రెండు, మూడు కార్యక్రమాలు నిర్వహించిన ఎర్రశేఖర్‌కు కొందరు నేతలతో పొసగలేదు. బండి సంజయ్ పర్యటనలో తగిన ప్రాధాన్యం లభించలేదని మనస్తాపానికి గురై.. జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అదే రోజు పార్టీ ప్రముఖులు జోక్యం చేసుకోవడంతో తన రాజీనామాని ఉపసంహరించుకున్నారు. కొన్నాళ్లు మిన్నకుండిపోయిన ఎర్రశేఖర్.. ఇప్పుడు బీజేపీకి గుడ్‌బై చెప్పేసి, కాంగ్రెస్‌లోకి చేరిపోయారు.
