కరోనా సమయంలో రోగులకు ధైర్యం చెబుతూ వైద్యం అందించాల్సిన ఆప్పత్రులు.. ఫీజుల దోపిడీకి తెరలేపాయి.. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను గాలికి వదిలేసి.. ఇష్టానుసారంగా ఫీజుల దందా చేస్తున్నాయి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతోన్న ఫీజుల వ్యవహారంపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.. దీంతో.. ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రి సహా ఐదు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది వైద్యారోగ్యశాఖ.. అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విరించి, విన్, టీఎక్స్, నీలిమ, మ్యాక్స్ హెల్త్ ఆస్పత్రుల కోవిడ్ చికిత్స లైసెన్స్‌ను రద్దు చేశారు.. కొత్తగా ఈ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లను చేర్చుకోవద్దు.. ఇప్పటికే చికిత్స పొందుతున్నవారికి నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రులు చికిత్స అందించాల్సి ఉంటుంది.