వానాకాలం పంట సీజన్‌కు సంబంధించిన సన్నద్ధత పనుల్లో తాము నిమగ్నమైన ఉన్నందున, కృష్ణా బేసిన్‌లో రిజర్వాయర్ల నిర్వహణపై చర్చించడానికి ఏర్పాటైన కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా, అందుకు బోర్డు అంగీకరించలేదు. వివిధ అంశాలపై చర్చించేందుకు నిర్ణీత గడువులు పెట్టుకున్నందున ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20నే జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేడు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ తొలి సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జలవిద్యుత్, రూల్ కర్వ్, మిగులు జలాల అంశాన్ని తేల్చే విషయాలపై ఈ సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించనున్నారు.
ఇటీవల కృష్ణా నదీ యాజమాన్యబోర్డు సమావేశంలో చర్చించిన మేరకు మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ) ఏర్పాటైంది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో మరో సభ్యుడు (విద్యుత్తు) ముతుంగ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, నారాయణరెడ్డి, తెలంగాణ జెన్‌కో డైరెక్టర్ వెంకటరాజం, ఆంధ్రప్రదేశ్ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ సుజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు.
