Site icon NTV Telugu

Telangana: ఒక్కరోజులో 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్.. రూ.5.5 కోట్ల ఆదాయం

తెలంగాణలో పెండింగ్ ఛలాన్‌లు క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన డిస్కౌంట్ విధానానికి భారీ ఎత్తున స్పందన వస్తోంది. దీంతో తొలిరోజే 5 లక్షల ట్రాఫిక్ ఛలాన్‌లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ల పరిధిలో ఏకంగా రూ.600 కోట్ల పై చిలుకు ట్రాఫిక్ ఛలాన్‌లు పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు రిబేట్ ప్రకటించారు.

అయితే తొలి రోజు లక్ష నుంచి 3 ల‌క్షల మంది వరకు వాహ‌న‌దారులు ట్రాఫిక్‌ ఛలాన్‌లు చెల్లిస్తారని పోలీసులు భావించగా.. 5 లక్షలకు పైగా పెండింగ్ ఛలాన్‌లు క్లియ‌ర్ అయిపోయాయి. దీంతో తొలిరోజే పోలీస్ శాఖ‌కు ఏకంగా రూ.5.5 కోట్ల మేర ఆదాయం ల‌భించింది. ఒకేసారి వాహ‌న‌దారులు పోటెత్తడంతో ఏకంగా ఈ-‌ఛలాన్ వెబ్ సైట్ క్రాష్ అయింది. దీంతో పలువురు వాహ‌న‌దారులు త‌మ పెండింగ్ ‌ఛలాన్‌లను క్లియ‌ర్ చేసుకోవాల‌నుకున్నా.. కుద‌ర‌లేదు. కాగా ఈనెల 31 వరకు పెండింగ్ ఛలాన్‌లను చెల్లించేందుకు పోలీసులు రిబేట్ ప్రకటించగా.. ఈ నెలాఖ‌రులోగా అన్ని క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీస్ శాఖ భావిస్తోంది.

Exit mobile version