Fire Accident: ఇప్పటివరకు మనం ఎలక్ట్రిక్ బైకులే కాలిపోవడం విన్నాం.. కానీ తొలిసారిగా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలోనే అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రూబీ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో రూబీ లాడ్జీపైకి మంటలు ఎగిసిపడ్డాయి. హోటల్‌లో కొందరు టూరిస్టులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హోటల్‌లో చిక్కుకుపోయిన వారిని కిందకు దించుతున్నారు.
బైక్ బ్యాటరీలు పేలుతుండటంతో షోరూం నుంచి భారీ శబ్దం వస్తోంది. అటు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్‌ల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. లాడ్జిలో దట్టంగా పొగలు అలుముకోవడంతో లోపలి వారు చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో చాలా ఎలక్ట్రిక్ బైకులు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
