NTV Telugu Site icon

మనమంతా భూమి బిడ్డలం.. పర్యావరణ బాధ్యత మనదే

మనం అందరమూ భూమి బిడ్డలమే, కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ బాధ్యత నెరవేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ లో మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి.

ఈ సందర్భంగా మానస వారణాసి మాట్లాడుతూ మనం అందరమూ భూమి బిడ్డలమే అని, మొక్కలు నాటి పర్యావరణ బాద్యత తీర్చటం మనపైన ఉందన్నారు. అందాల పోటీల్లో పాల్గొంటున్న తాను ఈ మెసేజ్ ను వీలైనంత వరకు ప్రచారం చేస్తానని అన్నారు. గ్రీన్ ఇండియాలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. నా వంతుగా మొక్కలు నాటానని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తన స్నేహితులు శిల్పారెడ్డి, అర్చన, రాజ్ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు మానస వారణాసి.