మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని తన కూతురు బతికుండగానే ఓ తండ్రి శ్రద్ధాంజలి ఘటించాడు. గుండు గీయించుకుని దినకర్మలు చేయించాడు. వివరాల్లోకి వెళ్తే… మద్దూరు గ్రామానికి చెందిన మాధవి అనే యువతి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దల ముందుకు తీసుకువెళ్లారు. అయితే పెద్దలు ససేమిరా అనడంతో ఈనెల 13న గుడిలో పెళ్లి చేసుకున్నారు.
అయితే తనను కాదని తన కూతురు మాధవి ప్రేమ పెళ్లి చేసుకోవడాన్ని ఆమె తండ్రి భరించలేకపోయాడు. తన దృష్టిలో తన కూతురు చచ్చిపోయిందని ఓ అభిప్రాయానికి వచ్చేశాడు. దీంతో తన కూతురు చనిపోయిందని గ్రామమంతా ప్రచారం చేస్తూ గుండు గీయించుకుని ఆమెకు కర్మకాండలు జరిపించాడు. అంతేకాకుండా కూతురి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. కాగా కూతురు బతికుండానే తండ్రి పిండం పెట్టిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
