NTV Telugu Site icon

Sangareddy: పొలానికి ట్యాంకర్‌ నీరే దిక్కు.. ఎంత కష్టం వచ్చిందయ్యా!

Farmers

Farmers

Sangareddy: రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్‌ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్‌ ట్యాంకర్‌లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులు నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని ఆకాశం వైపు చూస్తున్నారు. వారు నిద్రపోయే ముందు కూడా, వారు తమ పంటలను కాపాడుకోవడానికి వర్షాలు కురిసే అవకాశం ఉన్న మేఘాలేమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో ఓ రైతు ఇక వర్షం పడుతుందనే ఆశను కూడా కోల్పోయాడు. చౌటకూర్‌కు చెందిన రైతు మన్నె లింగయ్య(65) తన వరి నారును కాపాడుకోవడానికి ట్యాంకర్‌కు రూ. 2వేలు ఖర్చు చేసి నీటిని తెప్పించుకుంటున్నారు. చౌటకూర్‌ మండల కేంద్రంలో 2.5 ఎకరాల భూమి ఉన్న లింగయ్య గ్రామంలోని ఓ రైతు నుంచి మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ మూడు ఎకరాల భూమి చౌటకూర్ శివార్లలో ఉన్న నాయని చెరువు ఆయకట్టులో భాగం. నాయని చెరువు ద్వారానే 70 ఎకరాల సాగు భూమి ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో వర్షాలు లేక చెరువులో నీరు లేదు. మంజీరా నదిపై నిర్మించిన సింగూరు రిజర్వాయర్‌లో తగినంత నీరు లేకపోవడంతో నీటిపారుదల అధికారులు మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి నీటిని విడుదల చేయడం లేదు.

Read Also: Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు

లింగయ్య పొలం పక్కనే ఉన్న రైతు గామిని జోగయ్య వరినారు కూడా చాలా కాలంగా నీరు లేకపోవడంతో ఎండిపోయింది. రైతు మన్నె లింగయ్య మాట్లాడుతూ.. వరిని సాగు చేసేందుకు విత్తనాలకు, భూమి కౌలు కోసం, కూలీల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నామని.. ఇప్పుడు నీటి ట్యాంకర్ల ఖర్చు అదనంగా భారమైందన రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో.. వరి నారు ఎండిపోతోంది. ఆగస్టు 30 వరకు రుతుపవనాలు బలపడతాయని, వర్షాలు కురుస్తాయనే ఆశతో ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సింగూరు జలాశయానికి ఎగువ మంజీర నుంచి ఇన్ ఫ్లో వస్తే రైతుల పోరాటాలు ముగుస్తాయని, సింగూరు ప్రాజెక్టులో సరిపడా నీరు ఉండడంతో గత వానకాలం, యాసంగి సీజన్‌లలో వరి పంట బాగా పండిందని గుర్తుచేశారు.

గ్రామంలోని రైతులు పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లింగయ్య మూడుసార్లు విత్తే ప్రక్రియను పూర్తి చేశాడు. పంట కోసం అతని ఖర్చు మూడు రెట్లు పెరిగింది. అయితే పత్తి పంట ఇప్పుడు కూడా సరిగా మొలకెత్తలేదు. లింగయ్య చెప్పినట్లు సంగారెడ్డి అంతటా రైతులు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులంతా ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. వర్షాలు పడి సింగూరు జలాశయంలోకి నీరు వస్తే వారి కష్టాలు గట్టెక్కనున్నట్లు తెలుస్తోంది.